Sunday 20 October 2013

రాగ సుధా రస వాహిని

రాగ సుధా రస వాహిని
రచన: డా. ఆర్. సుమన్ లత
**********************  
'అలకలల్లలాడే రాముని గని'
స్వర"రాగ రత్నమాలిక" లల్లెదనని
దివికేగిన
త్రిస్వర సామ్రాజ్ఞి గళం
రాగబ్రహ్మార్చనలో
తులసిదళం.
మృదుమధురం
ఆమె అపూర్వగాత్రం.
సదాశివార్చనకేతెంచిన
బిల్వపత్రం
ఆమె నోట రాగం - తానం,
జన్య- జనక రాగాల మధురసంకీర్తనం
"వసంతో"దయంలో సరస - స్వర "భూపాలం",
సప్తస్వరాల "కదనకుతూహలంహలం",
అష్టపదుల "గానమూర్తి" జీవితం,
"త్రికాలాలూ" స్వరార్చనకే అంకితం.
"భావయామి రఘురామం"
నిత్య-నవరాగమాలికల సమాహారం.
అన్నమయ్య మధుర పద సంకీర్తనం.
భజగోవిందానంద ఆలోక దర్శనం.
"బృందావన సారంగం" లో "శ్రీ"రంగ విహారం
భక్తి భావాల అపురూప సంగమం.
రామభక్తి సామ్రాజ్య సందర్శనం
నాలుగు పురుషార్థాల పరమ పద సోపానం
నిత్యం పల్లవించే రస - రాగ - తాళ త్రివేణి,
సతతం గొంతులో జాలువారే " అమృతవర్షిణి"
ఆమె - ఎల్లరూ ఎరిగిన రసరాగ రంజని,
ఎల్లలే లేని "ఎమ్మెస్" ఒక రాగసుధారసవాహిని.
(స్వర్గీయ శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి అక్షర నివాళి)

No comments:

Post a Comment